Thimmarusu Movie Review: ఫెర్ఫార్మెన్స్తో సత్యదేవ్.. టేకింగ్తో శరణ్ ఆకట్టుకొంటూ..

0
24

Rating: 2.75/5

కరోనావైరస్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు ఓపెన్ కావడంతో ప్రేక్షకుడికి మరోసారి వినోదం చేరువైంది. థియేటర్‌లో సినిమాలు ఎప్పుడెప్పుడూ చూద్దామా అనే ప్రేక్షకులను తిమ్మరసు పలకరించింది. సెకండ్ వేవ్ తర్వాత థియేటర్‌లో జూలై 30న రిలీజైన తొలి చిత్రం తిమ్మరుసు సినిమా ఎలాంటి అనుభూతిని పంచింది? సత్యదేవ్‌, ఈ సినిమా టీమ్‌కు సక్సెస్ లభించిందా? అనే విషయం తెలుసుకోవాలంటే కథ, కథనాలను సమీక్షించుకొందాం..

తిమ్మరుసు కథ..

న్యాయ వ్యవస్థలో టాప్ లాయర్‌గా కావాలని యువ లాయర్ రామ్ అలియాస్ రామ చంద్ర (సత్యదేవ్) కలలు కంటుంటాడు. అయితే ఎనిమిదేళ్ల క్రితం అరవింద్ (చైతన్య రావు మాదాడి) అనే క్యాబ్ డ్రైవర్ హత్య కేసులో నిందితుడు వాసు (అంకిత్ కొయ్య) అనే యువకుడి కేసు వాదించడానికి సిద్ధమవుతాడు.

తిమ్మరుసులో ట్విస్టులు

తిమ్మరసు కథలో క్యాబ్ డ్రైవర్ అరవింద్ హత్య ఎందుకు జరిగింది? ఆ కేసులో పబ్‌లో పనిచేసే వాసుకు ఎందుకు శిక్ష పడింది. అరవింద్ హత్య కేసు, వాసు తరఫున లాయర్ ఎందుకు వాదించాలని నిర్ణయం తీసుకొంటాడు. ఈ కేసులో లాయర్ వాహనరావు (రవిబాబు), ఇన్స్‌పెక్టర్ భూపతి (అజయ్), మరో పోలీస్ అధికారి వాలి పాత్రలు ఏమిటి? ఇంకా బ్రహ్మాజీ, ప్రియాంక జవాల్కర్ పాత్రలు రాము చేసే ఇన్వెస్టిగేషన్‌కు ఎలా సహకరించాయి అనే ప్రశ్నలకు సమాధానమే తిమ్మరసు సినిమా కథ.

కథ, కథనాలు ఎలా ఉన్నాయంటే

పోలీస్ ఇన్పార్మర్‌గా పనిచేసే క్యాబ్ డ్రైవర్ అరవింద్ హత్యతో నేరుగా దర్శకుడు శరన్ కొప్పిశెట్టి కథలోకి వెళ్లి సినిమాపై ఆసక్తిని కలిగేలా కథనాన్ని రాసుకొన్నారు. కేసు దర్యాప్తులో వేగం లేకపోవడం కొంత అసహనం కలిగిస్తుంది. కాకపోతే సౌలభ్యం కోసం రాసుకొన్న ట్విస్టులు సినిమాపై పట్టు బిగించేలా చేస్తుంది. బ్రహ్మాజీ వన్‌ లైనర్ పంచులు పేలడంతో కొంత రిలాక్స్ అనిపిస్తుంది. స్లో అండ్ స్టడీ అనే మాదిరిగా రామ్ క్యారెక్టర్‌‌ను రాసుకొన్న తీరు బాగుంది. కథ పరంగా లక్ష్యాన్ని చేరడంలో నెమ్మదించినట్టు అనిపించినా.. గమ్యాన్ని చేరిన విధానం బాగుంది. క్లైమాక్స్‌లో ఇచ్చిన ట్విస్టు సినిమా మొత్తానికి ఫీల్‌గుడ్‌ ఫ్యాక్టర్‌గా మార్చిందని చెప్పవచ్చు.

దర్శకుడు శరణ్ గురించి

తిమ్మరుసు కథకు తగినట్టుగా దర్శకుడు శరణ్ తన పాత్రలు రాసుకొన్న విధానం ఆకట్టుకొన్నది. సత్యదేవ్, చైతన్య రావు మాదాడి పాత్రలు హృదయాన్ని తాకేలా ఉన్నాయి. హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్ రాంగ్ చాయిస్ అనిపిస్తుంది. విలనిజాన్ని తొక్కిపెట్టి కథనాన్ని చక్కగా నడిపించాడు. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్లను, కామెడీని బ్యాలెన్స్ చేసిన తీరు ఆకట్టుకొనేలా ఉంది. సెకండాఫ్‌ను దర్శకుడు డీల్ చేసిన విధానం సినిమాను నిలబెట్టిందని చెప్పవచ్చు.

సత్యదేవ్ ఫెర్ఫార్మెన్స్

కథలో బలం, పాత్రలో దమ్ము ఉంటే అద్బుతమైన టాలెంట్‌ను ప్రదర్శిస్తారనే అభిప్రాయం సత్యదేవ్‌పై ఉంటుంది. అందుకు తగినట్టుగానే తన బాడీ లాంగ్వేజ్‌కు తగినట్టుగా ఉన్న పాత్రలో దూరిపోయాడని చెప్పవచ్చు. లుక్‌ పరంగా ఫ్రెష్‌నెస్ కనిపించింది. సెకండాఫ్‌లో సత్యదేవ్ యాక్టింగ్ మరో రేంజ్‌లో ఉందని చెప్పవచ్చు.

చైతన్యరావు, బ్రహ్మాజి ఇతర పాత్రలు

ఇక 30 వెడ్స్ 21 మూవీతో మంచి నటుడిగా ఆకట్టుకొన్న చైతన్య రావు మరోసారి అరవింద్ పాత్రలో మెరిసాడు. పాత్ర చిన్నదైనా బాగా గుర్తుండిపోతాడు. దొరికిన నాలుగు సీన్లలోనైనా మంచి ఫెర్ఫార్మెన్స్‌ను చూపించాడు. అరవింద్ పాత్రతో మరిన్ని అవకాశాలను మెరుగు పరుచుకొనే ప్రయత్నం చేశాడని చెప్పవచ్చు. వాసు పాత్రలో కనిపించిన అంకిత్ కొయ్య అద్భుతంగా ఎమోషన్స్ పలికించారు. ఈ సినిమాకు వెన్నుముకగా నిలిచాడని చెప్పవచ్చు. కొత్తవాడైనా సినిమాను ఎమోషనల్‌‌గా నిలబెట్టడంలో తన వంతు పాత్రను పోషించాడు. సత్యదేవ్ పాత్ర ఎలివేట్ కావడానికి వాసు పాత్ర తోడ్పడింది.

ఇతర పాత్రల్లో..

ఇక ఈ సినిమాకు బ్రహ్మజి ప్లస్ పాయింట్. సీరియస్‌గా సాగే కథలో బ్రహ్మజి పాత్ర చక్కటి వినోదాన్ని అందించింది. ప్రియాంక జవాల్కర్ పాత్ర గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. గ్లామర్ పరంగా కూడా ఆకట్టుకోలేకపోయింది. అజయ్, రవిబాబు, ఝాన్సీ, హర్ష వైవా, ప్రవీణ్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నికల్ విషయానికి వస్తే…

సాంకేతిక విభాగాల పనితీరుకు వస్తే.. శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ సన్నివేశాలు హైలెట్ కావడానికి ఉపకరించింది. బ్యాక్ గ్రౌండ్ స్కోరు బాగుంది. అప్పు ప్రభాకర్ సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్ సిస్టమ్ సన్నివేశాల మూడ్‌ రిఫ్లెక్ట్ కావడానికి బాగా ఉపయోగపడింది. ఎడిటింగ్ విషయంలో బిక్కిన తమ్మిరాజుకు ఇంకా కొంత పని మిగిలి ఉందనే ఫీలింగ్ కలుగుతుంది. ఆర్ట్ విభాగం వర్క్ కూడా బాగుంది. లిఫ్ట్‌లో ఫైట్స్ కంపోజ్ పర్‌ఫెక్ట్‌గా అనిపించింది. వేద వ్యాస్ రాసిన డైలాగ్స్ ఆకట్టుకొన్నాయి.

ప్రొడక్షన్ వాల్యూస్..

నిర్మాతగా మహేష్ కోనేరు టాలీవుడ్‌కు మరో ఫీల్‌గుడ్ మూవీని అందించే ప్రయత్నం చేశారు. పాత్రల ఎంపిక విషయంలో (హీరోయిన్ తప్పిస్తే) మంచి టేస్ట్ కనిపించింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్‌కు తగినట్టుగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి. కోవిడ్ సమయంలో సినిమాను ధైర్యంగా రిలీజ్ చేయడమే కాకుండా మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకొనే ప్రయత్నం చేశారు.

ఫైనల్‌గా

సస్పెన్స్, థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్ అంశాలతో సాగే ఎమోషనల్ డ్రామా తిమ్మరుసు. చివరి 20 నిమిషాలు సినిమాకు హైలెట్‌. ఫస్టాఫ్‌లో కథను సాగదీసినట్టు, కొన్ని అవసరం సీన్లను జొప్పించినట్టు అనిపించినా.. చివర్లలో సర్దుకోవడం సినిమాకు ప్లస్ అయింది. ఫ్యామిలీ, యూత్‌ను ఆకట్టుకొనే చిత్రంగా తిమ్మరుసు రూపొందింది. భావోద్వేగంతో సాగే ఇన్వెస్టిగేషన్ తరహా చిత్రాలను ఆదరించే ప్రేక్షకులకు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.

తెర వెనుక, తెర ముందు

నటీనటులు: సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, అంకిత్ కొయ్య, చైతన్యరావు మాదాడి, రవిబాబు, అజయ్, ఝాన్సీ, ప్రవీణ్ తదితరులు స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శరన్ కొప్పిశెట్టి కథ: ఎంజీ శ్రీనివాస్ నిర్మాత: మహేష్ కోనేరు సినిమాటోగ్రఫి: అప్పు ప్రభాకర్ ఎడిటింగ్: తమ్మిరాజు మ్యూజిక్: శ్రీ చరణ్ పాకాల బ్యానర్: ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్ రిలీజ్ డేట్: 2021-07-30


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here