Kathi Mahesh మృతిపై పూనమ్ కౌర్ షాకింగ్ పోస్ట్: ప్రతి రోజూ చస్తూనే.. ఆ పార్టీ వల్లే అలా జరిగిందంటూ!

0
5

ప్రముఖ నటుడు, సినీ విమర్శకుడు కత్తి మహేశ్ ప్రయాణిస్తోన్న కారుకు కొద్ది రోజుల క్రితం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించి ఆయనకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఈ మధ్య ఆయన ఆరోగ్యం కుదుట పడిందని కూడా అన్నారు. కానీ, అంతలోనే ఘోరం జరిగిపోయింది. శనివారం సాయంత్రం కత్తి మహేశ్ తుదిశ్వాసను విడిచారు. దీంతో చాలా మంది ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ కత్తి మహేశ్ మరణంపై షాకింగ్ పోస్ట్ చేశారు.

అప్పటి నుంచి మొత్తం ఏం జరిగింది?

జూన్ 26న కత్తి మహేశ్ ప్రయాణిస్తోన్న కారు నెల్లూరు జిల్లాలోని హైవేపై ప్రమాదానికి గురైంది. సీటు బెల్టు పెట్టుకోకపోవడం వల్ల ఆయనకు గాయాలయ్యాయి. మొదట అతడిని స్థానికి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటి నుంచి మహేశ్‌కు అక్కడి వైద్యులు చికిత్స చేస్తున్నారు. దీంతో ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని అంతా అనుకున్నారు.

ఈ కారణంగానే కత్తి మహేశ్ మరణం

కత్తి మహేశ్ తలకు మాత్రమే గాయాలు అయ్యాయని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే, ఇప్పుడు ఆయన మరణించింది ఊపరితిత్తుల సమస్యతో అని తెలుస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో ఆయన ఊపిరితిత్తుల్లో చిన్నపాటి గాయం అయిందని.. అక్కడ రక్తం గడ్డ కట్టిందని తెలిసింది. అది రోజురోజుకూ విస్తరించడం వల్ల కత్తి మహేశ్ ప్రాణాలు కోల్పోయినట్లు చెబుతున్నారు.

సినీ కుటుంబంలో విషాద ఛాయలు

ఫిల్మ్ జర్నలిస్టుగా ప్రయాణాన్ని ప్రారంభించి.. ఆ తర్వాత రివ్యూ రైటర్‌గా గుర్తింపును తెచ్చుకున్నారు కత్తి మహేశ్. ఈ క్రమంలోనే సినీ దర్శకుడిగా, నటుడిగా ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పుడు కూడా చేతి నిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మరణం సినీ కుటుంబం విషాదాన్ని నింపింది. దీనిపై ప్రముఖులంతా సంతాపం తెలుపుతున్నారు.

కత్తి మహేశ్ మృతిపై పూనమ్ పోస్ట్

కత్తి మహేశ్ అప్పట్లో చాలా వివాదాల్లో చిక్కుకున్నారు. అందులో హీరోయిన్ పూనమ్ కౌర్‌ను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లు అప్పట్లో పెను సంచలనం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు యాక్సిడెంట్ అయినప్పుడు.. పాత గొడవలను ప్రస్తావిస్తూనే త్వరగా కోలుకోవాలని పూనమ్ పోస్టు పెట్టింది. ఇక, ఇప్పుడు కత్తి మహేశ్ మరణంపై ఈ హీరోయిన్ షాకింగ్ పోస్టు పెట్టింది.

ప్రతిరోజూ కొంచెం కొంచెంగా చచ్చాను

కత్తి మహేశ్ మరణించిన వార్తను తెలుసుకున్న పూనమ్ కౌర్.. తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘అప్పట్లో నా తప్పు ఏమాత్రం లేకుండానే నేను ప్రతి రోజూ కొంచెం కొంచెం చచ్చిపోయేదాన్ని. అప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుందో నా మనసుకు అసలే మాత్రం తెలిసేది కాదు. దీంతో నాకు చాలా బాధగా అనిపించేది’ అంటూ చాలా రోజుల క్రితం జరిగిన పాత ఘటనలను గుర్తు చేస్తూ కామెంట్లు చేసింది.

ఆ పార్టీ వల్లే అలా జరిగిందని పోస్టు

ఇదే పోస్టులో ఓ రాజకీయ పార్టీని సైతం పరోక్షంగా ప్రస్తావించింది పూనమ్ కౌర్. ‘నా పరువుకు భంగం కలిగించమని అతడిని ఓ రాజకీయ పార్టీ ప్రేరేపించింది. ఇది దళితులను దుర్వినియోగం చేయడమే. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా. ఇకపై ఎప్పుడూ మీ పేరు ప్రస్తావించకూడదని నిర్ణయించుకున్నా. ఓం శాంతి’ అంటూ ఊహించిన విధంగా వ్యాఖ్యలు చేసిందామె.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here