సునీల్ శెట్టి ఆపార్ట్మెంట్లో డెల్టా వేరియంట్ కలకలం.. ముగ్గురికి సోకిన కరోనా.. భవనం సీజ్!

0
11

బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌లో కోవిడ్19 వైరస్ పంజా విసిరింది. ఇప్పటికే అతలాకుతలం అవుతున్న ముంబైలోని కొత్త రకం వేరియంట్‌తో కూడిన వైరస్ బయటపడటంతో మళ్లీ దేశ ఆర్థిక రాజధానిలో కలకలం రేగుతున్నది.

దక్షిణ ముంబైలో డెల్టా వేరియంట్

నటుడు సునీల్ శెట్టి దక్షిణి ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో తన ఫ్యామిలీతో ఉంటున్నారు. అయితే ఆ అపార్ట్‌మెంట్‌లో ముగ్గురికి డెల్టా వేరియంట్ సోకినట్టు వైద్య బృందం గుర్తించింది. వెంటనే సునీల్ శెట్టి ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను సీజ్ చేశారు. ఈ విషయాన్ని అధికారికంగా సునీల్ శెట్టి పీఆర్ వర్గాలు పేర్కొన్నాయి.

సునీల్ శెట్టి కుటుంబం మరో చోటికి

ముంబై బీఎంసీ అధికారులు వెంటనే స్పందించడం, అపార్ట్‌మెంట్‌ను సీజ్ చేయడంతో సునీల్ శెట్టి కుటుంబం వెంటనే మరో ప్రాంతానికి షిఫ్ట్ అయింది. ఆ ఫ్లాట్‌లో తన భార్య, కూతురు, హీరోయిన్ అతియాశెట్టి, కుమారుడు అహాన్ శెట్టితో ఉంటున్నారు. అయితే తమ కుటుంబానికి ఎలాంటి ముప్పు లేదని సునీల్ శెట్టి పీఆర్ వర్గాలు వెల్లడించాయి.

అందులోనే పలువురు సినీ ప్రముఖులు

ఇదిలా ఉండగా, అదే అపార్ట్‌మెంట్‌లో పలువురు సినిమా ప్రముఖులు ఉంటున్నట్టు తెలిసింది. అయితే సినీ తారలు ఎవరెవరూ అక్కడ ఉంటున్నారనే విషయాన్ని బీఎంసీ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ప్రస్తుతం డెల్టా వేరియంట్ సోకిన బాధితులను వెంటనే హాస్పిటల్ తరలించి చికిత్సను అందిస్తునట్టు తెలిసింది.

బాలీవుడ్‌కు డెల్టా వేరియంట్ ముప్పు..

అయితే గత ఏడాది కాలంగా కరోనావైరస్ వ్యాప్తితో ముంబై నగరం బెంబేలెత్తింది. ఇప్పుడిప్పుడే మహానగరం కోలుకొంటున్నది. అంతా సవ్యంగా ఉందని భావిస్తున్న సమయంలో మళ్లీ డెల్టా వేరియంట్ బయటకు రావడంతో ముంబై ప్రజలు బిక్కు బిక్కుంటున్నారు. ఇక సినీ ప్రముఖులు ఇప్పడిప్పుడే షూటింగులతో బిజీగా మారుతున్న సమయంలో డెల్టా ముప్పుతో మరింత భయాందోళలనకు గురి అవుతున్నారు.

సునీల్ శెట్టి కెరీర్ ఇలా..

నటుడు సునీల్ శెట్టి కెరీర్ విషయానికి వస్తే.. చాలా గ్యాప్ తర్వాత ఆయన పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ఆయన మంచు విష్ణు రూపొందించిన మోసగాళ్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. అలాగే సంజయ్ గుప్తా రూపొందించిన ముంబై సాగా అనే బాలీవుడ్ చిత్రంలో కూడా ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, ఇమ్రాన్ హష్మీ, గుల్షన్ గ్రోవర్ తదితరులు నటించారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం సినీ విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here