విడాకుల తర్వాత జీవితం ఇలా: ఆసక్తికర ఫొటో వదిలిన సుమంత్.. ‘మళ్లీ మొదలైంది’ అంటూ!

0
10

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వర్రావు మనవడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. మొదటి చిత్రం ‘ప్రేమకథ’లో అద్భుతమైన యాక్టింగ్‌తో ఆకట్టుకున్న అతడు.. ఆ తర్వాత ఎక్కువగా లవ్ స్టోరీలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే కొన్ని విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కానీ భారీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాడు. ఇక, ఇటీవల పూర్తిగా పంథాను మార్చి వైవిధ్యమైన చిత్రాలతో వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ‘మళ్లీ మొదలైంది’ అంటూ అదిరిపోయే ప్రకటనను చేశాడు.

అలా మొదలైన కెరీర్.. హిట్లు ఇవే

‘ప్రేమకథ’ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుమంత్. నటుడిగా సక్సెస్ అయినప్పటికీ.. విజయాలు మాత్రం అతడికి అంత తొందరగా దక్కలేదు. అందుకే సుదీర్ఘమైన కెరీర్‌లో ‘సత్యం’, ‘గౌరీ’ వంటి చిత్రాలు మాత్రమే అతడికి సక్సెస్‌ను అందించాయి. వీటితో పాటు ఈ మధ్య కొన్ని మోస్తరు ఫలితాలను దక్కించుకున్నాడు. అయినా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడతను.

వరుస దెబ్బలు.. పంథాను మార్చి

కెరీర్ మొదలైనప్పటి నుంచి ఒకే తరహా సినిమాలు చేసుకుంటూ వచ్చిన సుమంత్.. పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఇటీవలి కాలంలో తన పంథాను పూర్తిగా మార్చుకున్నాడు. ఫలితంగా ‘గోదావరి’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘మళ్లీ రావా’ వంటి సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక, ఈ మధ్య వరుసగా వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకుని మంచి పేరును సంపాదించుకుంటున్నాడు.

వెడ్డింగ్ కార్డుతో రెండో పెళ్లి అంటూ

ఇటీవల సుమంత్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని ఓ న్యూస్ బయటకు వచ్చిన విషయం తెలిసిందే. దీనికి కారణం అతడి పేరుతో ఉన్న ఓ వెడ్డింగ్ కార్డ్ బయటకు రావడమే. దీంతో ఈ వ్యవహారం భారీ స్థాయిలో హాట్ టాపిక్ అయిపోయింది. దీనిపై దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా స్పందించే అంతగా ఇది వైరల్ అయింది. గతంలో సుమంత్.. నటి కీర్తి రెడ్డితో విడాకులు తీసుకున్నాడు.

రెండో వివాహంపై సుమంత్ క్లారిటీ

తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలపై తాజాగా సుమంత్ స్పందించాడు. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేసిన అతడు.. అందులో ‘నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానని వార్తలు వస్తున్నాయి. కానీ, నేను మరోసారి అలాంటి పని చేయట్లేదు. ఓ సినిమాకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ అది. ఫస్ట్ లుక్ బయటకు వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది’ అని చెప్పుకొచ్చాడు.

‘మళ్లీ మొదలైంది’ అంటూ కొత్తగా

సుమంత్ ప్రస్తుతం టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో ‘మళ్లీ మొదలైంది’ అనే సినిమాను చేస్తున్నాడు. ఇందులో నైనా గంగూలీ హీరోయిన్‌గా నటిస్తోంది. రెడ్ సినిమాస్ బ్యానర్‌పై కే రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దీనికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి మంచి స్పందన వస్తోంది.

ఆసక్తికర ఫొటో వదిలిన సుమంత్

‘మళ్లీ మొదలైంది’ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మూడు భాగాలుగా రూపొందించారు. మూడు ఫోజుల్లోనూ సుమంత్, నైనా బెడ్‌పై పడుకుని ఉన్నారు. అయితే, ఒక్కో సందర్భంలో ఒక్కోలా కనిపించారు. దీని మొత్తానికి ‘విడాకులు తర్వాత జీవితం’ అని అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టారు. తద్వారా ఈ సినిమా కాన్సెప్టును ముందుగానే వివరించారు. దీంతో ఇది వైరల్ అవుతోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here