వందమందిని ఢీకొట్టనున్న ఎన్టీఆర్..!

0
62

దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఇండియాలోనే బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా ‘ఆర్.ఆర్.ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో అల్లూరి సీతారామరాజు గా చరణ్.. కొమురం భీమ్ గా తారక్ కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా గురించి బయటకు వచ్చే ప్రతీ అంశం కూడా ట్రిపుల్ ఆర్ పై అంచనాలు ఆకాశాన్ని అంటేలా చేస్తున్నాయి.

‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ కు సంబంధించిన ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ గురించి సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇందులో కొమురం భీమ్ వందమంది బ్రిటీష్ సైనికులతో పోరాడే ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుందట. ఈ యాక్షన్ ఎపిసోడ్ ని స్పెషల్ గా డిజైన్ చేయించిన జక్కన్న.. దీని కోసం మూడు వారాల పాటు కష్టపడినట్లు తెలుస్తోంది. ఎన్నో వ్యయప్రయాసలు పడి చిత్రీకరించిన ఈ ఫైట్.. సినిమాలో ఓ ఎమోషనల్ సీన్ తర్వాత వస్తుందని టాక్ నడుస్తోంది.

RRR చిత్రంలో హైలైట్ గా నిలిచే అంశాల్లో ఈ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఒకటని ప్రచారం జరుగుతోంది. గతంలో రాజమౌళి – రామ్ చరణ్ కాంబోలో వచ్చిన ‘మగధీర’ చిత్రంలో వంద మందితో చేసే ఫైట్ భారీ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా ‘ఒకొక్కడినీ కాదు షేర్ ఖాన్.. ఒకేసారి వంద మందిని పంపించు’ అనే డైలాగ్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ లో ఎన్టీఆర్ తో జక్కన్న అలాంటి ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే యాక్షన్ ఎపిసోడ్ రూపొందించారని తెలుస్తోంది.

కాగా ఫిక్షనల్ పీరియాడికల్ మూవీగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో రామ్ చరణ్ సరసన ఆలియా భట్.. ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ కనిపించనున్నారు. అజయ్ దేవగన్ – శ్రియ – సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు – ఇద్దరు హీరోల ఇంట్రో టీజర్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఐదు ఐదు భాషలో వచ్చిన ‘దోస్తీ’ సాంగ్ కూడా యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ చిత్రానికి భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా పది భాషల్లో ఈ చిత్రాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రానికి ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘బాహుబలి’ వంటి విజువల్ వండర్ తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న ”RRR” చిత్రం కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ చిత్రాన్ని చివరగా అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీనికి తగ్గట్టుగా షూటింగ్ మొత్తం పూర్తి చేశారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశం లేదు. అందుకే ఈ చిత్రాన్ని మరోసారి పోస్ట్ పోన్ చేసి.. 2022 లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. త్వరలోనే తదుపరి రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here