రీమేక్ కథలనే నమ్ముకుంటున్న టాలీవుడ్ హీరోలు..

0
21

టాలీవుడ్ లో ఈ మధ్య రీమేక్ సినిమాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాల రైట్స్ తీసుకొని రీమేక్ చేయడమేనేది ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ.. ఇప్పుడు చాలామంది స్టార్ హీరోలు రీమేక్ లలో నటిస్తుండటంతో హడావిడి కనిపిస్తుంది. తమిళ కన్నడ మలయాళ హిందీ.. ఇలా ఒక భాషతో సంబంధం లేకుండా రీమేక్ రైట్స్ తీసుకుంటున్నారు. ఆఖరికి ఫ్రెంచ్ – కొరియా కథలను కూడా అరువు తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం టాలీవుడ్ లో రూపొందుతున్న రీమేక్ ల లిస్ట్ ఒక్కసారి పరిశీలిద్దాం!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిందీ ‘పింక్’ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కిన ‘వకీల్ సాబ్’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో పవన్ ప్రస్తుతం రానా దగ్గుబాటితో కలిసి నటిస్తున్న ‘#PSPKRana’ సినిమా కూడా రీమేక్ కావడం గమనార్హం. మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ సినిమా రీమేక్ గా ఈ సినిమా రానుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి కూడా ప్రస్తుతం రెండు రిమేక్ లను లైన్ లో పెట్టాడు. మలయాళ బ్లాక్ బస్టర్ ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో దర్శకుడు మోహన్ రాజా రీమేక్ చేస్తున్నారు. అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో తమిళ సినిమా ‘వేదలమ్’ ని చిరంజీవి రీమేక్ చేయబోతున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నటిస్తున్న రెండు సినిమాలు రీమేక్ కథలే. తమిళం బ్లాక్ బస్టర్ ‘అసురన్’ చిత్రానికి రీమేక్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమా చేస్తున్నారు. ఇదే క్రమంలో మలయాళ ‘దృశ్యం2’ చిత్రాన్ని అదే పేరుతో రీమేక్ చేశారు. మలయాళం ‘డ్రైవింగ్ లైసెన్స్’ తెలుగు రీమేక్ కూడా వెంకీ చేతికి వెళ్లిందని టాక్ నడుస్తోంది.

యూత్ స్టార్ నితిన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మాస్ట్రో’ కూడా రీమేక్ అనే విషయం తెలిసిందే. హిందీలో ఘన విజయం సాధించిన ‘అంధాదున్’ చిత్రాన్ని దర్శకుడు మేర్లపాక గాంధీ తెలుగులో రూపొందిస్తున్నారు. అలానే యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రెండు రీమేక్స్ లో నటిస్తున్నాడు. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని వీవీ వినాయక్ తో కలిసి హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఇదే క్రమంలో ఇటీవలె తమిళ్ లో బ్లాక్ బస్టర్ అయిన ‘కర్ణన్’ తెలుగు రీమేక్ లో బెల్లంకొండ నటించనున్నాడు.

తమిళంలో హిట్ అయిన ‘ఓ మై కడవులే’ చిత్రాన్ని తెలుగులో విశ్వక్ సేన్ ని హీరోగా పెట్టి తీస్తున్నారు. అలానే మలయాళ ‘కప్పేలా’ సినిమాని తెలుగు రీమేక్ లో కూడా విశ్వక్ హీరో అని టాక్. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమా రీమేక్ రైట్స్ దక్కించుకున్నారు. రాజ్ తరుణ్ హీరోగా హిందీలో సూపర్ హిట్ అయిన ‘డ్రీమ్ గర్ల్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారు. ఇక కన్నడలో సక్సెస్ అయిన ‘లవ్ మాక్ టైల్’ మూవీని తెలుగులో సత్యదేవ్ – తమన్నా భాటియా హీరోహీరోయిన్లుగా ‘గుర్తుందా శీతాకాలం’ పేరుతో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సుధీర్ వర్మ కొరియన్ ‘మిడ్ నైట్ రన్నర్స్’ చిత్రాన్ని తెలుగులో నివేదా థామస్ – రెజీనా లీడ్ రోల్స్ లో రూపొందిస్తున్నారు. ఇక కన్నడ హిట్ సినిమా ‘బెల్ బాటమ్’ ని సునీల్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తారని టాక్. ఈ మధ్య తమిళ్ వచ్చిన ‘మండేలా’ చిత్రాన్ని బండ్ల గణేష్ రీమేక్ చేయాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

అయితే టాలీవుడ్ హీరోలందరూ పర భాషా కథల కోసం ప్రాకులాడకుండా లోకల్ టాలెంటెడ్ రైటర్స్ కు డైరెక్టర్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని కామెంట్స్ చేసేవారు లేకపోలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి కంటెంట్ ఇవ్వగలిగే సత్తా ఉన్న రచయితలు దర్శకులు చాలా మందే ఉన్నారు. సరైన అవకాశాల కోసం వీరంతా ఎదురుచూస్తున్నారు. అందుకే కోట్లు ఖర్చు చేసి పరభాషా కథలను తీసుకోవడం కంటే లోకల్ టాలెంట్ ని గుర్తించి ఇండస్ట్రీకి కొత్తవారిని పరిచయం చేస్తే బాగుంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఇప్పటి నుంచైనా మన నిర్మాతలు హీరోలు లోకల్ టాలెంట్ ని ఎంకరేజ్ చేసే దిశగా ఆలోచన చేస్తారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here