రవితేజ ఔట్.. మరి బాలయ్య?

0
31

టాలీవుడ్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో అనుకున్నట్లుగానే ఒక సినిమా తర్వాత ఒకటి వాయిదా పడుతున్నాయి. సెకండ్ వేవ్ ప్రభావం పెరుగుతుండగా థియేటర్లు యధావిధిగా నడుస్తుండగానే గత నెలలో రావాల్సిన లవ్ స్టోరి టక్ జగదీష్ విరాట పర్వం చిత్రాలను వాయిదా వేయడం తెలిసిన సంగతే. వీటి స్థానంలోకి వచ్చిన ఇష్క్ ఏక్ మిని కథ థ్యాంక్ యు బ్రదర్ చిత్రాలను కూడా పోస్ట్పోన్ చేయక తప్పలేదు. ఆ తర్వాత మే సినిమాల వంతు వచ్చింది. 13న రావాల్సిన మెగాస్టార్ చిరంజీవి చిత్రం ‘ఆచార్య’ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. విక్టరీ వెంకటేష్ సినిమా ‘నారప్ప’ గురించి కూడా ప్రకటన రావడం లాంఛనమే. ఇక నెలాఖరుకు ఫిక్సయిన మాస్ రాజా రవితేజ సినిమా ‘ఖిలాడి’ వాయిదా గురించి ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. మే 28న రావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లు చిత్రీ నిర్మాణ సంస్థ ప్రకటించింది.

కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ‘ఖిలాడి’ని వాయిదా వేస్తున్నామని కొత్త రిలీజ్ డేట్ను తర్వాత ప్రకటిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు. మొదలు పెట్టిన రోజు నుంచి నిర్విరామంగా ‘ఖిలాడి’ సినిమా షూటింగ్లో పాల్గొంటూ వస్తున్నాడు రవితేజ. ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ జోరుకు ముందే ‘ఖిలాడి’ టీం యూరప్ వెళ్లిపోయింది. అక్కడ సజావుగానే చిత్రీకరణ జరిగినప్పటికీ.. తిరిగి ఇండియాకు వచ్చి ఇక్కడ మొదలుపెట్టాల్సిన షెడ్యూల్ను రద్దు చేయక తప్పలేదు. ఈ నెలలో థియేటర్లు తిరిగి తెరుచుకుని మునుపటిలా నడిచే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో సినిమాను వాయిదా వేయడం మినహా మరో మార్గం లేకపోయింది. మే 28కి మరో భారీ చిత్రం షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే.

నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీనుల కలయికలో తెరకెక్కతున్న ‘అఖండ’ కూడా అదే రోజు రావాల్సి ఉంది. ఐతే ఈ సినిమా షూటింగ్కూ బ్రేకులు పడ్డాయి. త్వరలో మళ్లీ షూటింగ్ పున:ప్రారంభిస్తున్నప్పటికీ అనుకున్న సమయానికి సినిమా పూర్తయ్యే ఛాన్స్ లేదు. థియేటర్ల పరిస్థితీ తెలిసిందే కాబట్టి ఈ చిత్రం కూడా వాయిదా పడటం లాంఛనమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here