రకుల్ విషయంలో ఎందుకిలా జరిగిందబ్బా?!

0
17

వెండితెరపై కథానాయికగా ఎంట్రీ లభించాలంటే అందం కావాలి .. అక్కడి నుంచి వెంటనే వెనక్కి వచ్చేయకూడదంటే అభినయం కావాలి. కొంతకాలమైనా నిలదొక్కుకోవాలంటే అదృష్టం కావాలి. అయితే వీటన్నింటికంటే ముందు అవకాశాలు రావాలి .. అలాంటి అవకాశాలను చేజిక్కించుకోవాలంటే లౌక్యం కావాలి. అలాంటి లౌక్యం పుష్కలంగా ఉన్న కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తుంది. కోలకళ్లతో .. వాలు చూపులతో తెరపై కనిపించిన ఈ అమ్మాయిని చూసి మనసు పారేసుకోని కుర్రాళ్లు లేరు.

రకుల్ చాలా యాక్టివ్ గా ఉంటుంది .. అందమైన అమ్మాయే కాదు .. అంతకు మించిన తెలివైన పిల్ల. చురుకుదనాన్ని .. చలాకీదనాన్ని దత్తత చేసుకున్నట్టుగా కనిపిస్తుంది. అందువల్లనే చిన్న సినిమాతో మొదలైన ఆమె కెరియర్ పెద్ద సినిమాల వైపు పరుగులు తీయడానికీ .. స్టార్ హీరోయిన్ అనిపించుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. చాలా తక్కువ గ్యాప్ లో ఆమె ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. చరణ్ … అల్లు అర్జున్ లతో సినిమాలను చుట్టబెట్టేసింది. ఆమె స్పీడ్ చూసి మిగతా హీరోయిన్లు కంగారు పడిపోయారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఆ తరువాత ఏం జరిగిందో తెలియదుగానీ .. తను కొనసాగిస్తూ వస్తున్న జోరు నుంచి రకుల్ హఠాత్తుగా జారిపోయింది. అదే సమయాల్లో ఆమె తమిళ .. హిందీ సినిమాలపై దృష్టి పెట్టింది. ఇక్కడ అవకాశాలు తగ్గుతున్నాయని గ్రహించి రకుల్ అటు వెళ్లిందా? లేదంటే ఆమె అటు దృష్టి పెట్టడం వలన ఇక్కడ శ్రద్ధ తగ్గిందా? అనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఇంతవరకూ తమిళ .. హిందీ భాషల్లో కూడా పొలోమంటూ ఆమెకి క్రేజ్ ను తెచ్చిపెట్టిన సినిమాలేం లేవు.

సౌందర్య తరువాత ఆ స్థాయి స్పీడ్ తో అవకాశాలను అందుకుంటూ .. స్టార్ డమ్ ను సంపాదించుకున్న రకుల్ కి ఎందుకు అంతే స్పీడ్ తో అవకాశాలు తగ్గాయనేది అర్థంకాని విషయంగా మారింది. ఇటీవల ‘చెక్’ సినిమాలో ఆమె చేసిన లాయర్ పాత్ర పెద్దగా ఆకట్టుకోలేదు. ‘కొండపొలం’ తప్ప తెలుగులో మరే సినిమాలో ఆమె పేరు కనిపించడం లేదు. అందం ఉంది .. అభినయం ఉంది .. తనని తాను నిరూపించుకుంది. అయినా ఆమె విషయంలో హఠాత్తుగా ఎందుకిలా జరిగిందబ్బా? అనేదే ఆమె అభిమానుల ఆలోచన!    

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here