పొలిటికల్ ఎంట్రీపై రజినీకాంత్ క్లారిటీ: దాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం.. ఇకపై అలాంటి పనులే!

0
9

దాదాపు నలభై ఏళ్లుగా సినీ రంగంలో విశేషమైన సేవలు అందిస్తూ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు సీనియర్ హీరో తలైవా రజినీకాంత్. ఏజ్ బార్ అవుతున్నా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఆయన.. రాజకీయాల్లోకి సైతం ప్రవేశించబోతున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఆ మధ్య పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్లు చెప్పారు. ఆ వెంటనే దాన్ని ఉపసంహరించుకున్నారు. ఇక, ఈరోజు రజినీకాంత్ తన రాజకీయ భవిష్యత్‌పై తేల్చేశారు. అదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

అభిమానులతో రజనీకాంత్ సమావేశం

 సూపర్ స్టార్ రజినీకాంత్ ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా అభిమానులను సంప్రదింపులు జరుపుతుంటారు. ఇప్పటికే పొలిటికల్ ఎంట్రీ గురించి పలుమార్లు వాళ్లతో సమావేశం అయ్యారు. ఈ క్రమంలోనే 12న చెన్నైలోని తన స్వగృహంలో రజినీకాంత్ ఫ్యాన్‌మీట్ నిర్వహించబోతున్నట్లు ఇటీవలే వెల్లడించారు. అందుకు అనుగుణంగానే ఈరోజు వాళ్లందరితో సమావేశం నిర్వహించారు.

అమెరికా పర్యటనపై రజినీకాంత్ క్లారిటీ

సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవలే వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లారు. ఆ సమయంలో ఆయనకు ఆరోగ్యం క్షిణించిందని.. ఏదో సమస్యతో బాధ పడుతున్నారని జోరుగా ప్రచారం జరిగింది. తాజా సమావేశంలో దీనిపై స్పందిస్తూ.. ‘సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఇటీవల నేను అమెరికా వెళ్లొచ్చాను. దిగులు చెందాల్సినది ఏమీ లేదు’ అంటూ తన ఆరోగ్యంపై వివరణ ఇచ్చారాయన.

అందుకే ఈరోజు సమావేశం అయ్యాను

రజినీకాంత్ ఫ్యాన్స్ మీట్ నిర్వహిస్తున్నారన్న వార్త బయటకు రావడంతో దీనిపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజా ప్రెస్‌మీట్‌లో ఫ్యాన్స్ అందరితో సమావేశం అవడానికి కారణం చెప్పారాయన. ‘సినిమా షూటింగులు, కరోనా పరిస్థితుల వల్ల మక్కళ్‌ మండ్రం నిర్వాహకులతో సరిగ్గా సంప్రదింపులు జరపలేకపోయాను. అందుకే ఇప్పుడు కలిశాను’ అని తెలిపారు.

పొలిటికల్ ఎంట్రీపైనా రజినీకాంత్ క్లారిటీ

ఇదే సమావేశంలో రాజకీయ ఆరంగేట్రం గురించి చర్చలు జరిపారు రజనీకాంత్. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘అభిమానులందరినీ నా రాజకీయ అరంగేట్రం గురించి ఎన్నో సందేహాలున్నాయి. ఫ్యూచర్‌లో నేను రాజకీయాల్లోకి వస్తానా? రానా? అని వాళ్లు నన్ను అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్లకు చెప్పేది ఏంటంటే.. నేను రాజకీయాల్లోకి రావట్లేదు’ అని తేల్చేశారు.

ర‌జినీ మ‌క్క‌ల్ మండ్రం ర‌ద్దు చేసిన స్టార్

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ కోసం అప్పట్లో ర‌జినీ మ‌క్క‌ల్ మండ్రం అనే సంస్థ ప్రారంభం అయింది. తాజా సమావేశంలో ఈ సంఘాన్ని సూపర్ స్టార్ రద్దు చేశారు. ‘గతంలో మొదలెట్టిన మక్కల్ మండ్రాన్ని రద్దు చేస్తున్నాను. దాని స్థానంలో ‘రజినీ అభిమాన సంక్షేమ మండ్రం’ అనే సేవా సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నాను. దాని ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తాము’ అని ప్రకటించారు.

త్వరలోనే అలా రాబోతున్న రజినీకాంత్

రజినీకాంత్ ప్రస్తుతం డైరెక్టర్ శివతో కలిసి ‘అన్నత్తే’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్‌ను ఆయన కంప్లీట్ చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న దీన్ని సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీతం ఇస్తున్నారు. ఇది త్వరలోనే రాబోతుంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here