నయనతార తీరు వేరు .. ఆమె దారి వేరు!

0
17

నయనతార నిలువెత్తు అందానికి నిర్వచనం .. అసలైన అభినయానికి ఆనవాలు. నయనతార ఏ ముహూర్తంలో తమిళ  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందోగానీ అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. కోలీవుడ్ లోకి ఒక తారాజువ్వలా దూసుకు వచ్చిన ఆమె అక్కడి స్టార్ హీరోలందరి సరసన ఎడా పెడా సినిమాలు చేసేసింది. ఇక ఇంచుమించు తెలుగులోను అదే జోరును కొనసాగించింది. ఒకానొక దశలో తెలుగు సినిమాలు చేయాడానికి ఖాళీ లేనంతగా ఆమె తమిళంలో బిజీ అయింది. సీనియర్ స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం వెయిట్ చేశారంటే నయనతార డిమాండ్ ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.

నయనతార పారితోషికం పెంచుతూ వెళ్లింది .. అయినా ఎవరూ మాట్లాడలేదు. ప్రమోషన్స్ కి రావడం కుదరదని తేల్చి చెప్పింది. అయినా వచ్చిన అవకాశాలు వెనక్కి వెళ్లలేదు. అందుకు కారణం ఆమెకి గల మార్కెట్ .. ఆమె సక్సెస్ రేట్.  సాధారణంగా ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితంలో ఏవైనా ఆటుపోట్లు ఎదురైతే వాటి ప్రభావం కెరియర్ పై పడుతూ ఉంటుంది. కానీ నయనతార విషయంలో అలా జరగలేదు. ఆమె ప్రేమ వ్యవహారాలు .. వైఫల్యాలు చాలామంది మాట్లాడుకుంటూ చాలా సమయాన్ని వృథా చేసుకున్నారుగానీ ఆమె మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా కెరియర్ పరంగా మరింత ముందుకు వెళ్లింది.

ఒక దశవరకూ గ్లామర్ పరమైన పాత్రలను ఎంచుకున్న ఆమె ఆ తరువాత నటన ప్రధానమైన పాత్రలకి మాత్రమే ఓకే చెబుతూ వచ్చింది. ఈ సమయంలోనే ఆమె లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది. హారర్ థ్రిల్లర్ .. సస్పెన్స్ థ్రిల్లర్ కథలను తెరపై పరుగులు తీయించింది. హీరోలతో సమానంగా థియేటర్లలో తన సినిమాలను నిలబెట్టేసింది .. వీలైనన్ని విజయాలను మూటగట్టేసింది. ఎక్కడా గ్లామర్ ఒలకబోయకుండా .. కనీసం పాటలు కూడా లేని సినిమాలకు ఆమె భారీ వసూళ్లను తెచ్చిపెట్టింది. నయనతారకి గల ఆ ప్రత్యేకత కారణంగానే కోటలాంటి ఆమె క్రేజ్ ను దాటుకుని వేరెవరూ ముందుకు వెళ్లలేకపోతున్నారు.     

ఇక ఒక స్టార్ హీరో సరసన చేసే అవకాశం వస్తే ఆ తరువాత వెనక వరుసలోని హీరోలతో చేయడానికి హీరోయిన్లు ఇష్టపడరు. తమ క్రేజ్ .. మార్కెట్ పడిపోతాయని భయపడిపోతుంటారు. కానీ నయనతార ఒక వైపున స్టార్ హీరోలతో చేస్తూ .. మరో వైపున నాయిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టులను చేస్తూ .. ఇంకో వైపున వర్ధమాన హీరోలతో సైతం నటించింది. ఇలా నయనతార కెరియర్ ను పరిశీలిస్తే ఆమె చేసిన ప్రయోగాలు .. తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు కనిపిస్తాయి. తను చేసుకున్న ప్లానింగును నిలకడతో .. నిబ్బరంతో అనుసరించిన తీరు స్పష్టమవుతుంది. నయనతార ఈ స్థాయికి రావడానికి అందం .. అభినయం మాత్రమే కాదు ఆత్మవిశ్వాసం కూడా ప్రధానమైన కారణమని చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.       

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here