తిట్టాలన్నదీ ఉద్దేశ్యం కాదు.. ఆయనతో విభేదాలు లేవు.. సైకో వర్మపై ఆర్జీవి స్పందన

0
55

నిర్మాత నట్టి కుమార్ రూపొందిస్తున్న సైకో వర్మ చిత్రంపై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించారు. నట్టీస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి క్రాంతి సమర్పణలో నిర్మాతలు నట్టి కరుణ, అనురాగ్ కంచర్ల సంయుక్తంగా ‘సైకో వర్మ’ (వీడు తేడా) పేరుతో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టైటిల్, పాటను రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ క్రమంలో వస్తున్న మీడియా వార్తలపై రాంగోపాల్ వర్మ, నట్టి కుమార్ స్పందిస్తూ..

మా మధ్య విభేదాలు లేవు..

సినిమా అనేది ఓ స్పృజనాత్మక కళ. ఆ ప్రక్రియలో భాగంగానే కథకు తగ్గట్టుగా సైకో వర్మ టైటిల్‌తోపాటు అందులోని పాట పుట్టింది తప్ప కేవలం నన్ను తిట్టాలన్న ఉద్దేశ్యం కాదు. మా మధ్య విబేధాలు వచ్చాయనే వార్తలు మీడియాలో వస్తుండటం నా దృష్టికి వచ్చింది. వాస్తవానికి నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్, నేను స్నేహితులం మాత్రమే కాదు మంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా. వారితో కలిసి నేను సినిమాలు చేస్తున్నాను. కానీ మా గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఇక సైకో వర్మ పాటకు అశేష ప్రేక్షక ఆదరణ లభిస్తుండటం ఆనందంగా ఉంది అని వర్మ వివరించారు.

వర్మతో కలిసి సినిమాలు చేస్తున్నా

వర్మకు, నాకూ మధ్య విబేధాలు తలెత్తాయని కొందరు అపోహ చెందుతున్నారు. అయితే అవి వాస్తవాలు కాదు. మేమిద్దరం మంచి స్నేహితులం. కొన్ని సినిమాలను కలసి చేసాం, మరికొన్ని సినిమాలను కలసి చేయబోతున్నాం కూడా అని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పష్టం చేశారు. తాజాగా విడుదల చేసిన పిచ్చోడి చేతిలో రాయి ‘సైకో వర్మ’ మన భాయీ” అంటూ సాగే లిరికల్ సాంగ్ విశేషమైన స్పందనతో ట్రెండింగ్‌లోకి రావడం హ్యాపీగా ఉంది అని నట్టి కుమార్ అన్నారు.

సైకో వర్మను తప్పుగా అర్ధం చేసుకొన్నారు…

సైకో వర్మ టైటిల్‌తోపాటు లిరికల్ సాంగ్ చూసిన ప్రేక్షకులు, అభిమానులు మా మధ్య గొడవలు వచ్చాయని భ్రమపడుతున్నారు. కానీ మా మధ్య పటిష్టమైన స్నేహబంధం వుంది. వర్మకు సినిమానే శ్వాస, ధ్యాస. సంచలనాలకు మారు పేరైన వర్మ కరోనా టైమ్‌లో కూడా అత్యధిక సినిమాలు చేశారు. ప్రస్తుతం ఏడు సినిమాలతో క్షణం తీరికలేనంతగా ఆయన బిజీగా వున్నారు. సైకో అంటే పిచ్చి. వర్మ సినిమా పిచ్చోడు కాబట్టి ఆ ఆర్ధాన్ని అన్వయించేలా ఈ టైటిల్ పెట్టాం అని నట్టి కుమార్ తెలిపారు,

వర్మపై వ్యతిరేకతతో కాదు..

క్రియేటివిటీ దర్శకుడిగా వర్మ సినిమా ప్రస్థానాన్ని ఆవిష్కరిస్తూ ఆయన మనస్తత్వాన్ని ఆ పాటలో ప్రతిబింబింప చేసే ప్రయత్నం చేశామే తప్ప వర్మ పట్ల వ్యతిరేకతతో మాత్రం కాదు అని నట్టి కుమార్ వివరించారు. సెప్టెంబర్ 9న ఈ చిత్రం షూటింగును ప్రారంభించి నిరవధికంగా కొనసాగిస్తాం. ఇప్పుడొస్తున్న చిత్రాలకు మాత్రం భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని గట్టిగా చెప్పగలం. అయితే కథ అంశాన్ని ఇప్పుడే చెప్పదలచుకోలేదు. ఆర్టిస్టులతోపాటు మిగతా వివరాలను త్వరలో వెల్లడిస్తాం అని నట్టికుమార్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here