చావు బతుకుల్లో భార్య.. నా వల్ల కాదన్నా, నేను నటించలేను అన్నా వినకుండా, మూడో రోజే అలా?

0
9

జీవి సుధాకర్ నాయుడు అంటే తెలుగు ప్రేక్షకులకు త్వరగా గుర్తుపట్టడం కష్టమే కానీ ఆయన ఫోటోలు, ఆయనను చూసిన తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా గుర్తుపడతారు. ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించిన ఈ నటుడి భార్య ఆరోగ్య విషమించి కొన్నాళ్ళ క్రితం కన్నుమూశారు. అయితే దానికి మూడు రోజుల ముందు జరిగిన విషయం గురించి ఆయన వెల్లడించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే….

భార్య చావుబతుకుల్లో

నటుడిగా అనేక వందల సినిమాల్లో కనిపించిన జీవి సుధాకర్ నాయుడు ఆ తర్వాత హీరో సినిమాతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత శ్రీకాంత్ హీరోగా రంగా ది దొంగ సినిమా తెరకెక్కించినా ఆ సినిమా కూడా ఆయనకు అంతగా పేరు తీసుకు రాలేదు. అయితే ఆయన ప్రస్తుతం సినిమాల్లో అయితే పూర్తి స్థాయిలో నటించడం లేదు. నిజానికి రెండేళ్ల క్రితం ఆయన భార్య ఆయనకు దూరం అయ్యారు. చాలా కాలం అనారోగ్యంతో బాధ పడిన సుధాకర్ భార్య శైలజ ఎట్టకేలకు ఏప్రిల్ నెల 2019 వ సంవత్సరంలో కన్నుమూశారు. అయితే ఈ విషయం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు సుధాకర్ నాయుడు.

1997 అనే సినిమాలో

తాజాగా ఆయన 1997 అనే సినిమాలో నటించారు.. డాక్టర్ మోహన్, హీరో నవీన్ చంద్ర, కోటి ప్రధాన పాత్రలో మోహన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ మీద తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లాంచింగ్ ఈవెంట్ హైదరాబాద్ లో తాజాగా గ్రాండ్ గా జరిగింది.. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరైన నారప్ప దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.. ఇక ఈ మోషన్ పోస్టర్ లాంచింగ్ అనంతరం జీవి సుధాకర్ నాయుడు వేదికమీద మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.. ఈ సినిమా షూటింగ్ సమయంలో తన భార్య రెండు కిడ్నీలు కోల్పోయి దాదాపు చావుబతుకుల్లో ఉందని అప్పుడు వచ్చి తనను ఈ సినిమా చేయాలని అడిగారు అని అన్నారు. అయితే తన భార్యతో ఉండాలనే ఉద్దేశంతో నేను ఎలాంటి సినిమా చేయలేనని చెప్పానని ఆయన అన్నారు

చెప్పిన మూడో రోజే

అయితే తన భార్య ఈ సినిమా చేయాలని సూచించిందని ఆమె చెప్పిన మూడో రోజే కన్నుమూసిందని చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇక సినిమా అంటే తనకు ప్రాణం అని ఆయన చెప్పిన ఆయన సినిమా కోసం తనకు ఉన్న అన్ని బిజినెస్ లు లీజ్ కి ఇచ్చి సినిమా కోసం ప్రాణాలు పెట్టి బతుకుతున్నా అని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమా ద్వారా తనకు మంచి పేరు వస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ప్రస్తుతానికి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. ఇక నిజానికి జీవి సుధాకర్ నాయుడు దర్శకరత్న దాసరి నారాయణరావు దగ్గర బంధువు.

దాసరి దగ్గరి బంధువు

తనకు సినిమాల మీద మొదట అంత ఆసక్తి ఉండేది కాదని కానీ తన బంధువైన దాసరి నారాయణ రావు గారు ఒక సినిమాలో నటించాలని కోరడంతో ఆయన మాట కాదనలేక నటించానని సుధాకర్ నాయుడు గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇక తనకు చిరంజీవి అంటే చాలా అభిమానం అని పేర్కొన్న ఆయన ఈ విషయం తెలిసి దాసరి స్వయంగా చిరంజీవి పేరు లోని చివరి రెండు అక్షరాల తీసి నా పేరు ముందు కలిపారని అప్పటి నుంచి అదే నా పేరుగా స్థిరపడిపోయింది అని సుధాకర్ నాయుడు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా అంతపురం సినిమా ద్వారా తనకు మంచి గుర్తింపు లభించింది అని పేర్కొన్న ఆయన ఆ తర్వాత మంచి పాత్రలు పోషించాను అని కూడా వెల్లడించారు. ఇక హైదరాబాద్ లో 100 మంది పేద ముస్లిం పిల్లలను తన స్నేహితులతో కలిసి కొన్నేళ్లుగా చదివిస్తున్నానని కూడా జీవి గతంలో వెల్లడించారు

రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూసినా

ఇక సుధాకర్ నాయుడు గతంలో రాజకీయాల్లో కూడా చక్రం తిప్పాలని చూశారు. 2014 సంవత్సరంలో సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి విశాఖపట్నం గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చిన ఆయన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కూడా చేరి తన సేవలు అందించారు. అయితే రాజకీయంగా ఆయనకు పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. ఇక ఆయన వంగవీటి సినిమాను కూడా స్వయంగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేశారు కానీ అవి కూడా పెద్దగా వర్కవుట్ కాలేదని తెలుస్తోంది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here