కొవిడ్ బాధితులకు ఊపిరి ఊదుతున్న హీరోయిన్!

0
25

దేశంలో కొవిడ్ వేలాది మందిని బలిగొంటోంది. వైరస్ కారణంగా చనిపోతున్న వారి సంఖ్య 4 వేలకు చేరువ అవుతోంది. అయితే.. వీరిలో చాలా మంది ఆక్సీజన్ అందకనే ప్రాణాలు కోల్పోతుండడం దురదృష్టకరం. దేశంలో ఉత్పత్తి అవుతున్న మెడికల్ ఆక్సీజన్ చాలకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. బాధితులకు తనవంతుగా ఊపిరి ఊదేందుకు ప్రయత్నిస్తోంది హీరోయిన్ ప్రణీత.

గతేడాది లాక్ డౌన్ సమయంలోనూ తనవంతుగా కొవిడ్ బాధితులకు సహకారం అందించారు ప్రణీత. చాలా మందికి ఆహారం సరఫరా చేశారు. ఇప్పుడు సెకండ్ వేవ్ లోనూ మరోసారి హెల్పింగ్ హ్యాండ్ అందిస్తున్నారు. తొలిదశ కరోనా సమయంలో అందరికీ ఆహారం అందించామన్న ప్రణీత.. ఇప్పుడు ఆహారం కన్నా.. ఆక్సీజన్ ఎక్కువ అవసరమైందన్నారు. అందుకే.. తన చారిటీ ద్వారా ఆక్సీజన్ సిలిండర్లు కాన్సన్ట్రేటర్లు అందించే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు.

ఇందుకోసం లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చినట్టు తెలిపారు ప్రణీత. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో మిగిలిన వారు కూడా తమ వంతు సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఆక్సీజన్ అందక ఎన్నో వేల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ప్రణీత.. ఈ కష్టాల నుంచి తోటివారిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

మనల్ని మనం రక్షించుకుంటూనే.. ఎదుటివారి కోసం సహాయం చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు తమకు తోచిన విధంగా సమాజానికి సహకారం అందించాలని కోరారు. ప్రణీత పిలుపునకు సోషల్ మీడియాలో పూర్తిస్థాయి మద్దతు తెలుపుతున్నారు నెటిజన్లు. ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here