కష్టం తెలిసిన వారే సాయం చేస్తారనడానికి సంపూ నే నిదర్శనం..!

0
21

కష్టం తెలిసిన వారే సాయం చేస్తారని.. సాయం చేసే మనసుండాలే కానీ ఆస్థులు అంతస్తులు అవసరం లేదని అంటుంటారు. దానికి నిదర్శనమే హీరో సంపూర్ణేష్ బాబు. ఎవరైనా ఆపదలో ఉన్నా ప్రకృతి వైపరీత్యాల వల్ల ప్రజలకు నష్టం వాటిల్లినా నా వంతు సహాయం చేస్తానంటూ తొలి అడుగు వేస్తారు. పెద్ద పెద్ద స్టార్స్ మాదిరి భారీ పారితోషికాలు తీసుకోకున్నా.. తనకు వచ్చిన దాని నుంచే ఇతరులకు అండగా ఉండే ప్రయత్నం చేస్తుంటారు సంపూ. నిజం చెప్పాలంటే ఇటీవలి కాలంలో ప్రతి సంక్షోభ పరిస్థితుల్లోనూ టాలీవుడ్ నుండి నిలబడిన మొదటి వ్యక్తి ఆయనే అని చెప్పవచ్చు.

ప్రముఖ సినీ జర్నలిస్ట్ నటుడు టీఎన్నార్ కరోనా కారణంగా మృతి చెందిన సంగతి తెలిసిందే. అయితే ఆయన కుటుంబానికి తనవంతు సహాయం చేయడానికి ముందుకొచ్చిన సంపూర్ణేశ్ బాబు.. రూ.50 వేలు ఆయన భార్య జ్యోతి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. టీఎన్నార్ ఇంటర్వ్యూ ద్వారా తాను వ్యక్తిగతంగా కెరీర్ పరంగా ఒక మెట్టు పైకి ఎదిగానని.. ఆయన కుటుంబానికి ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తనవంతు సాయం తప్పకుండా చేస్తానని మాటిచ్చి సంపూర్ణేష్ దాతృత్వాన్ని చాటుకున్నారు.

గతేడాది కోవిడ్ రిలీఫ్ ఫండ్ కు సంపూర్ణేష్ బాబు రూ. లక్ష విరాళంగా అందించారు. అలానే హైదరాబాద్ వరద బాధితులకు తన వంతు సహాయంగా రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు అయినప్పటికీ ఇతర రాష్ట్రాల ప్రజలకు కూడా సహాయం చేశాడు. 2019లో కర్ణాటక వరద బాధితుల సహాయార్థం రూ.2 లక్షలు.. 2018 లో శ్రీకాకుళం వరద సహాయ నిధికి రూ.50 వేలు అందించారు. సంపూ ఔదార్యం చూపించిన సందర్భాలు ఇంకా చాలా ఉన్నాయి.

సాదారణ కుటుంబం నుంచి ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిన సంపూర్ణేష్ బాబు.. అన్ని వేళలా తనవంతు సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇండస్ట్రీలో మిగతా వారిలాగా ఆర్ధికంగా బలంగా లేనప్పటికీ.. సంపూర్ణేష్ ప్రజలకు సహాయం అవసరమైనప్పుడల్లా ముందుకొస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సినిమాల్లో చిన్న పాత్రలే వేసినా సహాయం చేయడంలో తనది ఎంతో పెద్ద మనసు అని చాటుకుని ప్రజల మన్ననలు పొందుతున్నాడు సంపూ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here