కత్తి మహేష్ మృతి మీద తండ్రి అనుమానం.. సర్కార్ సీరియస్.. ఆయన మీదే పోలీసుల ఫోకస్ ?

0
16

సినీ క్రిటిక్ కత్తి మహేష్ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత చికిత్స పొందుతూ కన్నుమూసిన సంగతి తెలిసిందే.. అయితే ఆయన మృతి మీద ఇప్పటికే అనేక అనుమానాలు వ్యక్తం అవుతుండగా తాజాగా ఆయన తండ్రి ఓబులేసు కూడా తన కుమారుడు మహేష్ మృతి చెందిన విషయం మీద అనుమానం వ్యక్తం చేశారు.

అది అన్యాయం

సినీ రంగానికి చెందిన కత్తి మహేష్ మరణం మీద సిట్టింగ్ జడ్జితో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం విచారణ జరిపించాలని మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అధికార వైసీపీ అలాగే జగన్ కోసం కత్తి మహేష్ గత అసెంబ్లీ అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారని ఆయన అన్నారు. కత్తి మహేష్ బాబు భౌతిక కాయానికి కూడా లోకల్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా ఏ వైసీపీ ఎమ్మెల్యే నివాళులర్పించక పోవడం అన్యాయం అని ఆయన పేర్కొన్నారు.

కరివేపాకులో

ప్రతి చిన్న విషయానికి స్పందించే సీఎం జగన్ ఈ విషయం మీద కనీసం సంతాప ప్రకటన కూడా చేయలేదని, దళితులను కరివేపాకులా తీసి పారేస్తూ గౌరవం, గుర్తింపు ఇవ్వడం లేదని మరోసారి అర్థం అయిందని అన్నారు. కత్తి మహేష్ మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపే వరకు ఒత్తిడి తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. కత్తి మహేష్ అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన ఈ మేరకు డిమాండ్ చేశారు.

నా వయసు అయిపొయింది

అయితే మందకృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలు మరువకముందే కత్తి మహేష్ తండ్రి ఓబులేసు కూడా తన కుమారుడు మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కత్తి మహేష్ మరణించిన విషయం తమ కంటే ముందే బయటకు చెప్పారని ఆయన వెల్లడించారు. అందుకే కత్తి మహేష్ మృతికి సంబంధించిన న్యాయ విచారణ జరిపి నిజానిజాలు బయటపెట్టాలని ప్రభుత్వాన్ని ఆయన అభ్యర్థించారు. ప్రస్తుతం వయోభారం రీత్యా తన శరీరం సహకరించడం లేదని ప్రభుత్వమే తమకు న్యాయం చేయాలని ఓబులేషు విజ్ఞప్తి చేశారు.

అతని మీద ఫోకస్

ఇక మందకృష్ణ డిమాండ్ మేరకు ఏపీ సర్కార్ విచారణ కూడా ప్రారంభించింది. యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవింగ్ చేసిన సురేష్ ని ఏపీలోని నెల్లూరు పోలీసులు విచారణకు పిలిచారు. ప్రమాదం జరిగినప్పుడు, కత్తి మహేష్ తీవ్రంగా గాయపడితే సురేష్ కు ఎందుకు చిన్న గాయం కాలేదని అనే యాంగిల్‌లో విచారణ జరుపుతున్నారు. ప్రమాదం తర్వాత ఏం జరిగిందనే దానిపై పోలీసులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

పోలీసుల ముందుకు

ఇలా ఉండగా, ప్రమాద సమయంలో కత్తి మహేష్ కారు నడిపిన సురేష్ కోవూరు పోలీస్ స్టేషన్ లో ఈరోజు విచారణకు హాజరయ్యారు. సీఐ రామకృష్ణారెడ్డి.. డ్రైవర్ సురేష్ ను విచారిస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంలో ఎన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో వేచి చూడాలి.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here