కత్తి మహేష్ ఆకస్మిక మరణానికి కారణం.. ఆయనను వెంటాడిన సమస్య ఏమిటంటే

0
8

సినీ విమర్శకుడు, దర్శకుడు, నటుడు, సామాజిక కార్యకర్త, మృదుస్వభావి కత్తి మహేష్ మరణంతో స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. దాంతో తొలుత నెల్లూరు, ఆ తర్వాత చెన్నై హాస్పిటల్‌కు తరలించారు. అయితే కోలుకొన్నట్టే కనిపించిన మహేష్ కత్తి హఠాత్తుగా మరణించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే కత్తి మహేష్ మరణానికి కారణం ఏమిటంటే..

జూన్ 26వ తేదీన ప్రమాదం

కత్తి మహేష్ జూన్ 26వ తేదీ తెల్లవారు జామున ఆయన నెల్లూరుకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగింది. ఆయనను నెల్లూరు హాస్పిటల్‌కు నాలుగు గంటల ప్రాంతంలో తరలించారు. అప్పటికీ విపరీతమైన రక్తస్రావం జరిగింది అని సన్నిహితులు తెలిపారు.

తలలో బలమైన గాయాలు

నెల్లూరు హస్పిటల్‌లో వైద్యులు ప్రాథమికంగా చికిత్స నిర్వహించిన తర్వాత వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితిని వివరించారు. రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయాలు తగిలాయి. గాయాలే కాకుండా తలలో పలు గాయాలు చోటుచేసుకొన్నాయి. అలాగే ఓ కన్నుకు తీవ్రంగా గాయమైంది. ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటంతో ఆయనను వెంటిలేటర్‌పైకి తరలించాం అని వైద్యులు రిపోర్టులో వెల్లడించారు.

ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టి..

అయితే మెరుగైన చికిత్స కోసం కత్తి మహేష్‌ను హాస్పిటల్‌కు తరలించిన తర్వాత ఆయనలో శరీరంలో పలు రకాల సమస్యలు వెలుగు చూశాయని ఆయన సన్నిహితులు పేర్కొన్నారు. ఇటీవల ఆయన ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం (పల్‌మనరీ ఎంబోలిజం) వైద్యులు గుర్తించి.. ఆ సమస్యను పరిష్కరించే దిశగా వైద్యులు చికిత్సను ప్రారంభించారు. అయితే సమస్య జఠిలం కావడంతో కత్తి మహేష్ శనివారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు.

పల్‌మనరీ ఎంబాలిజం అంటే ఏమిటి?

పల్‌మనరీ ఎంబాలిజం అంటే .. ఊపిరితిత్తుల్లోని రక్తనాళాల్లో గడ్టకట్టడం. రక్తం గడ్డకట్డడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అవుతుంది. గడ్డ కట్టిన నాళాలు ఊపిరితిత్తుల నుంచి కాళ్లు లేదా దేహంలోని ఇతర అవయవాల్లోని రక్త నాళాలకు ప్రవహిస్తాయి. రక్త సరఫరాను స్తంభింప చేస్తాయి. దీంతో మనిషి ప్రాణాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతుంది అని వైద్యులు వెల్లడిస్తుంటారు. అయితే మహేష్ కత్తి మరణానికి అసలు కారణం పోస్ట్ మార్టమ్ రిపోర్ట్‌లో వెల్లడయ్యే అవకాశం ఉంది.

వస్తాడు.. తగిన సమాధానం చెబుతాడు..

గత కొద్ది రోజులుగా మహేష్ కత్తి ఆరోగ్యం కుదుటపడినట్టు కనిపించింది. ఇక కత్తి మహేష్ వచ్చి కొందరి వాదనలకు, విమర్శలకు తగిన సమాధానం చెబుతారని స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కత్తి మహేష్ చికిత్స విషయంలో అంతా సవ్యంగా జరుగుతుందని భావిస్తున్న తరుణంలోనే ఆయన ఆకస్మికంగా మరణించారు. దాంతో ఆయన అభిమానించే ప్రతీ ఒక్కరు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. సంతాప సందేశాలతో సోషల్ మీడియాలో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొంటున్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here