ఒకే సినిమా కోసం ఇద్దరు దర్శకులు.. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో..?

0
20

ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల విషయంలోనే కాకుండా పర్సనల్ గా కూడా ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. పవన్ తో ఇప్పటి వరకు మూడు సినిమాలను డైరెక్ట్ చేసిన త్రివిక్రమ్.. ఒక సినిమాకి మాట సాయం చేశారు. అలానే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ తో కలిసి ఓ సినిమాని నిర్మించడమే కానుందా కథ – మాటలు అందించారు. అయితే పవర్ స్టార్ నటించే ఇతర సినిమాల విషయంలో కూడా త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఉంటుందని ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఇప్పుడు ‘#PSPKRana’ ప్రాజెక్ట్ లో కూడా త్రివిక్రమ్ జోక్యం ఎక్కువగా ఉంటోందని సినీ వర్గాల్లో అనుకుంటున్నారు.

మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కొశీయుమ్’ తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాగర్ కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నాడు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు మలయాళ మూలకథలో పలు మార్పులు చేర్పులు చేసిన త్రివిక్రమ్.. పవన్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకొని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని జత చేసాడు. ఈ క్రమంలో దగ్గరుండి సినిమా పనులన్నీ చూసుకుంటూ.. త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

ఇటీవల పవన్ కళ్యాణ్ పోషిస్తున్న భీమ్లా నాయక్ పాత్రను రివీల్ చేస్తూ మేకర్స్ విడుదల చేసిన మేకింగ్ వీడియో చూస్తే ఈ విషయం ఇట్టే అర్థం అవుతుంది. ఇందులో డైరెక్టర్ సాగర్ చంద్ర కంటే ఎక్కువగా త్రివిక్రమ్ హైలైట్ అవుతూ కనిపించాడు. ఇది చూసి దీనికి దర్శకుడు త్రివిక్రమ్ అనుకున్నవారు కూడా లేకపోలేదు. ఇప్పుడు బయటకు వస్తున్న ప్రతి ఫొటోలో కూడా త్రివిక్రమ్ ఉంటున్నాడు. ఇదంతా చూస్తుంటే త్రివిక్రమ్ హ్యాండ్ ఇందులో ఎక్కువగా ఉంటుందనేది తెలుస్తోంది. ఇదే సాగర్ చంద్ర క్రియేటివిటీని దెబ్బతీసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

వాస్తవానికి ‘వకీల్ సాబ్’ సినిమా వేణు శ్రీరామ్ చేతికి వెళ్ళడానికి.. ‘#PSPKRana’ ప్రాజెక్ట్ సాగర్ వద్దకు రావడానికి కూడా త్రివిక్రమ్ ఒక కారణం.  ‘అప్పట్లో ఒకడుండేవాడు’ వంటి సినిమాతో సాగర్ నిరూపించుకున్నప్పటికీ.. యంగ్ డైరెక్టర్ కు త్రివిక్రమ్ అనుభవం హెల్ప్ అవుతుందని నిర్మాతలు ఆలోచించారు. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ఇందులో ఇద్దరు హీరోల పాత్రలు బ్యాలన్స్ చేయడానికి.. హీరోల మధ్య ఈగో వల్ల వచ్చే వైరం కరెక్ట్ గా ప్రొజెక్ట్ చేయడానికి స్క్రీన్ ప్లే-డైలాగ్స్ త్రివిక్రమ్ రాయిస్తున్నామని తెలిపారు.

అయితే త్రివిక్రమ్ జోక్యం ఎక్కువ ఉండటం వల్ల సాగర్ నామమాత్రంగా ఉంటున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీని వల్ల ఇబ్బందేమీలేదు కానీ.. త్రివిక్రమ్ – సాగర్ ఇద్దరూ దర్శక రచయితలు కాబట్టి ఆలోచనలు వేరువేరుగా ఉంటేనే సినిమాకి ఇబ్బంది. వీరికి తోడు పవన్ కూడా దర్శకుడే. మరి ఈ ముగ్గురు కలిసి చేస్తున్న ఈ ప్రాజెక్ట్ ఔట్ పుట్ ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే ‘PspkRana’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. పవన్ కళ్యాణ్ – రానా లతో పాటుగా ఇతర ప్రధాన నటీనటులు పాల్గొనే సీన్స్ ని షూట్ చేస్తున్నారు. పవన్ ఇందులో భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ గా కనిపించనున్నారు. పవన్ కు జోడీగా నిత్యా మీనన్ నటిస్తుండగా.. రానా సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here