అభిమానిని భోజనానికి పిలిచిన సోనూ!

0
28

అధికారం చేతిలో ఉన్నవాళ్లు కరోనా బాధితుల గురించి పట్టించుకోవట్లేదని విమర్శలు వినిపిస్తున్న చోట.. బాలీవుడ్ నటుడు సోనూ సూద్ చేస్తున్న సహాయక చర్యలు యావత్ దేశాన్ని నివ్వెర పరుస్తున్నాయి. అతడే ఒక సైన్యంలా అందిస్తున్న సహకారానికి అందరూ ఫిదా అవుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది ఆయన అభిమానులుగా మారిపోతున్నారు.

అలాంటి అభిమానుల్లో ఒకరైన శ్రీకాకుళం వాసి లాల్ ప్రసాద్ దకోజీ సోనూ సూద్ చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించాడు. సోనూ సేవలను కొనియాడుతూ వేసిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఆర్ట్ ను శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్నాయుడు ట్విటర్ వేదికగా షేర్ చేశారు.

‘‘సోనూ సూద్.. కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాల్చిన సమయంలో మీ నిస్వార్థమైన పనులతో చాలా మందికి స్ఫూర్తిగా నిలిచారు. వేలాది మందికి సహాయం చేస్తున్నారు. శ్రీకాకుళానికి చెందిన లాల్ ప్రసాద్ దకోజీ కూడా మీ సేవలను ఆరాధిస్తున్నాడు. ఈ అందమైన పెయింటింగ్ మీకోసం వేశారు. ఈ పెయింటింగ్ ను షేర్ చేయడానికి సంతోషిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

ఈ ట్వీట్ కు సోనూ స్పందించారు. ‘‘లాల్ ప్రసాద్ నైపుణ్యాన్ని షేర్ చేసినందుకు ధన్యవాదాలు. అతన్ని వ్యక్తిగతంగా కలవాలని చూస్తున్నాను. మనమంతా కలిసి లంచ్ ప్లాన్ చేద్దాం’’ అంటూ ట్వీట్ చేశారు సోనూ. కాగా.. కొవిడ్ మొదటి దశలో ఎంతోమందికి అండగా నిలిచిన సోనూ.. ఇప్పుడు సెకండ్ వేవ్ లోనూ తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here