సినిమాగా కార్తీకదీపం సీరియల్.. బుల్లితెర రికార్డులు.. ఇక వెండితెర మీద మ్యాజిక్కు సిద్ధం!

0
9

తెలుగు టెలివిజన్ చరిత్రలో అరుదైన రికార్డులను సొంతం చేసుకొంటున్న సీరియల్స్‌లో కార్తీకదీప ఒకటి. అయితే సుదీర్ఘంగా ప్రసారమవుతున్న ఈ సీరియల్‌ విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. అయితే ఈ సీరియల్ కంటెంట్‌ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లోని ఫ్యామిలీ ఆడియెన్స్ ఆకట్టుకొంటున్న ఈ సీరియల్‌ను సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. అయితే ఆ వివరాలకు సంబంధించిన విషయాల్లోకి వెళితే..

మలయాళంలో తొలిసారి సీరియల్‌గా

కార్తీకదీపం సీరియల్‌ తొలుత మలయాళ భాషలో కరుతముత్తు అనే టెలివిజన్ ధారావాహికగా రూపొందింది. మలయాళంలో అద్భుతమైన విజయం సాధించడంతో ఇతర భాషల నిర్మాతలను విశేషంగా ఆకర్షించింది. ఆ తర్వాత కన్నడలో ముద్దులక్ష్మి, తమిళంలో భారతీ కన్నమ్మ, మరాఠీలో రంగ్ మజా వెగ్లా, హిందీలో కార్తీక్ పూర్ణిమగా సీరియల్ తెరకెక్కింది. తెలుగులో కార్తీకదీపంగా విశేష ఆదరణ చూరగొట్టున్నది.

టీఆర్పీలో అద్భుతమైన రేటింగ్

ఇక తెలుగు టెలివిజన్ రంగంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కార్తీకదీపం సీరియల్ అద్భుతమైన స్పందనను సొంతం చేసుకొన్నది. ప్రతీ వారం రేటింగ్ విషయంలో మెరుగైన ఫలితాన్ని పెంచుకొంటూ పోతున్నది. గతవారం టీఆర్పీ చూసుకొంటే 26వ వారంలో కార్తీక దీపం సీరియల్ అర్బన్‌లో 16.12, రూరల్‌లో 16.04 రేటింగ్‌ను సాధించింది. ఇప్పటి వరకు ఏ సీరియల్‌కు ఇంతటి టీఆర్పీ వచ్చిన దాఖలాలు తక్కువే.

1100 ఎపిసోడ్స్ వైపు ప్రయాణం

కార్తీకదీపం సీరియల్ బుల్లితెరపై అన్ని రకాలుగా మ్యాజిక్ చేస్తున్నది. ఈ సీరియల్ ఇటీవల 1000 ఎపిసోడ్స్ పూర్తి చేసుకొని 1100 ఎపిసోడ్స్‌కు చేరువైంది. సీరియల్ కంటెంట్, నటీనటులు ఫెర్ఫార్మెన్స్, కథ, కథనాలు ఈ సీరియల్‌ను టాప్ రేటింగ్‌ను అందుకొనేలా చేస్తున్నది. కథలోని మలుపులు ఎపిసోడ్‌ ఎపిసోడ్‌కు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపుతున్నది.

బుల్లితెర నుంచి వెండితెరకు

అయితే ఇలాంటి పరిస్థితులను, ప్రేక్షకుల ఆసక్తిని, అభిమానాన్ని అంచనా వేసిన సినిమా యూనిట్.. ఇప్పుడు మొత్తం కంటెంట్‌ను కుదించి సినిమాగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వెండితెర ప్రేక్షకులకు కూడా ఈ సీరియల్ కంటెంట్‌ను పరిచయం చేసి ఆదరణను అందుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే సీరియల్ యూనిట్ అధికారికంగా స్పందిస్తే తప్పా.. ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

కార్తీకదీపంలో నటీనటులు, సాంకేతిక నిపుణులు

గగన్ టెలివిజన్ షో బ్యానర్‌పై నిర్మతా గుత్తా వెంకటేశ్వరరావు రూపొందించిన కార్తీకదీపం సీరియల్‌కు కాపుగంటి రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఎడిటర్‌గా ఫణి భట్ సేవలందిస్తున్నారు. ఈ సీరియల్‌లో దీపగా ప్రేమీ విశ్వనాథ్, నిరుపమ్ పరిటాల లీడ్ రోల్స్‌లో నటించారు. మౌనితగా శోభా శెట్టి, హిమగా బేబీ సహ్రు, శౌర్యగా బేబీ కార్తీక, సౌందర్యగా అర్చనా అనంత్, ప్రియమణిగా శ్రీదేవి తదితరులు నటించారు. అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్‌ స్టార్ మాలో ప్రసారం అవుతున్నది.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here