లూసిఫెర్ రీమేక్ దర్శకుడు మారారా?

0
19

మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న లూసీఫర్ ని తెలుగులో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు వెర్షన్ కి `తని ఒరువన్` ఫేం మోహన్ రాజాని దర్శకుడిగా ఎంపిక చేశారు. అతడు ప్రస్తుతం స్క్రిప్టు పనుల్లో ఉన్నారు. పలుమార్లు చిరుతో స్క్రిప్టు విషయం చర్చించినా కానీ ఆయన పూర్తిగా సంతృప్తి చెందలేదని రకరకాల మార్పులు సూచించారని ఇదివరకూ కథనాలొచ్చాయి.

తెలుగు నేటివిటీకి తగ్గట్టు అవసరం మేర మార్పుల్ని బాస్ చిరంజీవి సూచిస్తున్నారు. అయితే ఫైనల్ డ్రాఫ్ట్ విషయంలో మోహన్ రాజా వందశాతం మెప్పించలేకపోతున్నారని అందువల్ల దర్శకుడి మార్పు పైనా చిరు ఆలోచిస్తున్నారని రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే లూసీఫర్ స్క్రిప్టును తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్చడం అంత సులువైన విషయం కాదు. కేరళ రాజకీయాలతో మిళితమైన ఈ స్క్రిప్టును తెలుగు రాజకీయాలకు మార్చడం అంత సులువు అని భావించలేం. అలాగే మెగాస్టార్ రాజకీయ కెరీర్ లో పరిణామాలు కూడా కొన్నిటికి అడ్డంకిగా మారే వీలుంది. ప్రజలు ఈ సినిమాలో పాత్రల్ని చూసేప్పుడు కచ్ఛితంగా ఇక్కడ చిరు పొలిటికల్ ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుంటారు. కాబట్టి లూసీఫీర్ రీమేక్ పాత్రను కూడా చాలా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. బహుశా ఆ విషయంలో మోహన్ రాజా మెప్పించలేక తడబడుతున్నారా? అతడు ఏపీ రాజకీయాల్ని.. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని స్క్రిప్టులో బ్యాలెన్స్ చేయలేకున్నారా? ఇవన్నీ శేష ప్రశ్నలేనని ఊహిస్తున్నారు. ఫైనల్ గా చిరుని ఒప్పించి సెట్స్ కెళ్లడం ఒక్కటే ఈ ఊహాగానాలకు చెక్ పెట్టగలదు.

లూసీఫర్ చిత్రంలో మోస్ట్ పవర్ ఫుల్ నాయకుడికి నమ్మకస్తుడిగా శక్తివంతుడిగా మోహన్ లాల్ నటించారు. అతడి పాత్రతో యాక్షన్ ఎమోషన్ పీక్స్ లో ఉంటుంది. రాష్ట్రంలో పొలిటికల్ గాడ్ ఫాదర్ మరణించాక.. అతడి వారసత్వం కోసం పాకులాడే దొంగల నడుమ ఒక మహిళ నాయకత్వాన్ని కాపాడేందుకు పాటుపడేవాడిగా లాల్ పాత్ర ఉంటుంది. డ్రగ్స్ – మాఫియా- దేవుడు అంటూ చాలా సంగతులే ఉంటాయి. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here