మా ఎన్నికల బరిలోకి సోను సూద్? తెర వెనుక జోరుగా ప్రయత్నాలు.. సినీ వర్గాల్లో మరో గందరగోళం

0
10

టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. పలు రకాల ప్యానెల్స్ రంగంలోకి దిగడంతో ఆరోపణలు, ప్రత్యారోపణలు ఊపందుకొన్నాయి. అయితే మా ఎన్నికలకు సంబంధించి రకరకాల ఊహాగానాలు, రూమర్లు, గాసిప్స్ సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం అవుతున్నాయి. అయితే తాజాగా సోనుసూద్‌ను మా ఎన్నికల బరిలోకి దించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారనే విషయం సినీ వర్గాల్లోను, మీడియా వర్గాల్లోను ఆసక్తిని రేపుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రకాశ్ రాజ్ ముందస్తు ప్రణాళిక

మా సంస్థ ఎన్నికలు ఇంకా మూడు నెలలు ఉండగానే ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొంటున్నారు. పోటాపోటీగా మీడియా సమావేశాలను నిర్వహిస్తూ సినీ తారలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకొంటున్నారు. ఇలాంటి క్రమంలో మా అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు ప్రకాశ్ రాజ్ ముందే తన ప్రణాళికలను సిద్ధం చేసుకొన్నారు. తన ప్యానెల్‌లోని సభ్యులతో మీడియా సమావేశం నిర్వహించి తన ప్రణాళికను వివరించి.. ఎన్నికలు వచ్చేంత వరకు మీడియా ముందుకు రాలేమని స్పష్టం చేశారు.

నరేష్ మద్దతుదారులు ఘాటుగా

ఇక మా మాజీ అధ్యక్షుడు నరేష్ తన మద్దతు దారులతో సమావేశం నిర్వహించి కొత్త గందరగోళాన్ని సృష్టించారు. మా ఎన్నికల వేడి చల్లారుతుందని అనుకొనే లోపే ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌పై పరోక్షంగా విమర్శలు సంధించారు. తన మద్దతుదారులు కరాటే కల్యాణి లాంటి సినీ తారలతో దారుణమైన వ్యాఖ్యలు చేయించారు.

ఆంధ్రా, తెలంగాణ అంటూ

ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ, ఆంధ్రా అంటూ కొత్త వాదన మొదలైంది. మా సంస్థను వేర్వేరుగా విభజించాలి. తెలంగాణ, ఆంధ్రాగా రాష్ట్రం విడిపోయి రెండు రకాలు సంస్థలు ఆవిర్బావం చెందాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలోని కళాకారులకు సొంతంగా మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఉండాలనే కొత్త వాదనను తెరపైకి తెచ్చారు.

నాన్ లోకల్.. లోకల్ అంటూ

ఇదిలా ఉంటే ప్రకాశ్ రాజ్ అభ్యర్థిత్వాన్ని కొందరు బాహాటంగా విమర్శిస్తూ.. ఆయన నాన్ లోకల్ అంటూ కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. అయితే ఆ వాదనలను ప్రకాశ్ రాజ్ తిప్పి కొడుతూ సినీ తారలకు, కళాకారులకు లోకల్? నాన్ లోకల్ అని ముద్ర వేస్తారా? కళాకారులు యూనివర్సల్. వారికి కులం, మతం, ప్రాంతం అనే అంటగట్టకూడదని హితవు పలికారు.

సోను సూద్ రంగంలోకి అంటూ రూమర్

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణను సొంతం చేసుకొన్న సోనుసూద్‌ను మా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దించాలని కొందరు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అయితే సోనుసూద్ మాత్రం అయిష్టతను వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. అయితే సోనుసూద్‌ను ఒప్పించి మా ఎన్నికలను మరింత రసవత్తరంగా మార్చాలని ప్లాన్ వేసినట్టు తెలుస్తున్నది. అయితే ఈ వ్యవహారంపై అధికారిక ప్రకటన వస్తే తప్ప క్లారిటీ వచ్చే అవకాశం లేదంటున్నారు.

మంత్రి కేటీఆర్‌తో సోను సూద్ భేటీ

ఇటీవల సోనుసూద్, మంత్రి కేటీఆర్‌ సమావేశం తర్వాత ఈ వాదన కొత్తగా తెరపైకి వచ్చింది. అయితే సినీ వర్గాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజమెంత అనే విషయంపై కొందరు ఆరా తీస్తున్నట్టు తెలిసింది. ప్రకాశ్ రాజ్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు సోనుసూద్‌ను రంగంలోకి దింపితే తప్పేమిటి అనే వాదన కొందరు బలపరుస్తున్నట్టు తెలిసింది. మంగళవారం ప్రగతి భవన్‌లో దర్శకులు మెహర్ రమేష్, వంశీ పైడిపల్లితో కలిసి మంత్రి కేటీఆర్‌ను సోనుసూద్ కలిసిన విషయం తెలిసిందే.
LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here