‘బన్నీ – బోయపాటి’ ఊర మాస్ కాంబోలో మరో సినిమా..?

0
22

టాలీవుడ్ ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను – స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ”సరైనోడు”. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. బన్నీలోని మాస్ యాంగిల్ ని కంప్లీట్ గా బయటకి తీసిన ఈ సినిమా.. అప్పటికి ఆయన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమా వచ్చి ఐదేళ్లయినా ఇప్పటికీ బుల్లితెరపై మంచి టీఆర్పీతో విశేష ఆదరణ దక్కించుకుంటోంది. అందుకే ‘బన్నీ – బోయపాటి’ మాస్ కాంబినేషన్ లో మరో మూవీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ తో సినిమా కోసం బోయపాటి చర్చలు జరుపుతున్నాడని తెలుస్తోంది.

వాస్తవానికి ‘సరైనోడు’ సూపర్ సక్సెస్ అయిన తరువాత గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మరో సినిమా చేయడానికి బోయపాటితో ఒప్పందం కుదుర్చుకున్నారట. దీని కోసం దర్శకుడికి ప్రొడక్షన్ హౌస్ నుండి భారీ మొత్తంలో అడ్వాన్స్ అందినట్లు టాక్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బన్నీ తో ప్రాజెక్టు గురించి చర్చించడానికి బోయపాటి ఇటీవల అల్లు అరవింద్ ను రెండుసార్లు కలిశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. బోయపాటి ఇప్పటికే అల్లు అర్జున్ కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసే పనిలో ఉన్నాడని.. త్వరలోనే హీరోని కలిసి నేరేట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.

బన్నీ ‘పుష్ప’ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. అయితే రీసెంటుగా ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో ప్రాజెక్ట్ సెట్ అవడంతో అల్లు అర్జున్ తదుపరి సినిమా ఎంటనేది క్లారిటీ లేకుండా పోయింది. వేణు శ్రీరామ్ తో చేయాల్సిన ‘ఐకాన్’ ప్రాజెక్ట్ కూడా మరో హీరో చేతికి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ తో ఓ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరిపినప్పటికీ ఇప్పట్లో అది సెట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ క్రమంలో మురగదాస్ దర్శకత్వంలో బన్నీ ఓ సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బన్నీ – బోయపాటి కలయికలో మరో మూవీ ఎప్పుడు ఉంటుందో చూడాలి. మరోవైపు బోయపాటి శ్రీను ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో ‘అఖండ’ అనే హ్యాట్రిక్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని తర్వాత మాస్ డైరెక్టర్ చేయబోయే సినిమా ఎంటనేది ఇంకా తెలియరాలేదు. మరి త్వరలోనే బోయపాటి – బన్నీ ప్రాజెక్ట్ పై స్పష్టత వస్తుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here