నందమూరి హీరోలతో స్టార్ డైరెక్టర్ మల్టీస్టారర్..?

0
29

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం విదితమే. డెబ్యూ మూవీ పటాస్ నుండి సరిలేరు నీకెవ్వరూ వరకు ఖాతాలో వరుసగా హిట్స్ వేసుకొని దర్శకుడుగా స్టార్డం సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ఫుల్ సీక్వెల్ ఎఫ్3 మూవీ రూపొందిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ మధ్యన అనిల్ తదుపరి సినిమాను నటసింహం బాలయ్యతో చేయాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. కొన్నేళ్లుగా బాలయ్యతో సినిమా తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్న అనిల్.. ఇప్పటివరకు బాలయ్యతో సినిమా చేయలేకపోయాడు. అయితే ఇటీవలే అనిల్ కథకు బాలయ్య ఓకే చెప్పాడని ఇండస్ట్రీలో న్యూస్ వైరల్ అవుతోంది.

అయితే ఈ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుందని అంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే.. అనిల్ సినిమాలన్ని కామెడీ ప్రధానంగా ఉంటాయి. మరి బాలయ్య సినిమాలేమో కమర్షియల్ హంగులతో మాస్ సినిమాలుగా ఉంటాయి. అంతేగాక బాలయ్య ఫ్యాన్స్ కూడా ఆయనను మాస్ సినిమాలలో చూడటానికే మక్కువ చూపుతారు. ప్రస్తుతం బాలయ్య మాస్ డైరెక్టర్ బోయపాటితో అఖండ సినిమా చేస్తున్నాడు. బోయపాటి – బాలయ్య కలయికలో అఖండ మూడో సినిమా కాగా హ్యాట్రిక్ కొడతారని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉండగా.. బాలయ్యతో అనిల్ సినిమా పై సోషల్ మీడియాలో పలు కథనాలు వినిపిస్తున్నాయి.

ఏంటంటే.. అనిల్ బాలయ్యతో తీయాలనుకున్న సినిమాలో ఇద్దరు హీరోలకు ఆస్కారం ఉన్నట్లు టాక్. అంటే మల్టీస్టారర్ గా సినిమా ఉండబోతుందట. అయితే బాలయ్యతో పాటు నందమూరి మరో హీరో కళ్యాణ్ రామ్ రంగంలోకి దిగనున్నట్లు సమాచారం. అనిల్ సినిమాలో బాలయ్యతో పాటు కళ్యాణ్ రామ్ సెకండ్ హీరోగా ప్లాన్ చేస్తున్నాడట. ఇదివరకు బాలయ్య – కళ్యాణ్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ బయోపిక్ రూపొందింది. ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ తండ్రి హరికృష్ణ పాత్రలో నటించాడు. మరి ఒకవేళ ఈ వార్తలు నిజమైతే.. ఈసారి బాబాయ్ పక్కన ఎలాంటి రోల్ చేయనున్నాడో అని ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. అదేవిధంగా పటాస్ తర్వాత కళ్యాణ్ రామ్ – అనిల్ కలయికలో రాబోయే సినిమా ఇదే అవుతుంది. చూడాలి మరి త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ రానుందేమో!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here